మన తెలుగు

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 4

జూన్ 2014


ఒక మాస్టారు విద్యార్థితో “ఒరేయ్, సరైన ఉచ్ఛారణ నేర్చుకోరా” అన్నాడనుకోండి. అప్పుడు ఆ మాస్టారుకే సరైన ఉచ్చారణ తెలియదనుకోవాలి. ఉచ్చారణను ఉచ్ఛారణ అని తప్పుగా ఉచ్చరించటం చాలా మంది విద్యాధికులు చేసే పొరపాటు (పొరబాటు కాదు). ఆంగ్లంలో కూడా ఈ ఉచ్చారణ అన్న పదానికి సంబంధించిన సరైన ఉచ్చారణ తెలియక చాలా మంది పప్పులో కాలు వేస్తుంటారు. ఉచ్చరించటంను ఆంగ్లంలో ప్రొనౌన్స్ (Pronounce) అంటాము. కాని ఉచ్చారణను మాత్రం ప్రొనౌన్సియేషన్ (Pronounciation) అనకూడదు, ప్రొనన్సియేషన్ (Pronunciation) అనాలి.

కొన్ని పదాలను కొందరు సరిగ్గానే రాస్తారు కాని వాటిని ఉచ్చరించటం లోనే పొరపాటు చేస్తారు. ‘విద్యార్థులు’కు బదులు విధ్యార్థులు అని ఉచ్చరిస్తారు. అదేవిధంగా ‘అధ్యాపకులు’కు బదులు అద్యాపకులు అని పలుకుతారు. టీచర్లకన్న స్టూడెంట్లు గొప్పవాళ్లు కనుక (!), విద్యార్థులకు రెండవ అక్షరానికి వత్తు తగిలించి, అధ్యాపకులకు ఉన్న వత్తును తొలగించటం జరుగుతుందని, పైగా స్టూడెంట్లు విద్య చేత ‘ఆర్తి’ చెందినవారు (బాధ పెట్టబడిన వారు) కనుక విధ్యార్తులు అని కూడా పలుకుతారని సినారె గారు ఒక సాహిత్య సభలో చమత్కరించటం నాకింకా జ్ఞాపకమే.

కోమా(Coma) ను కొంతమంది అపస్మారం అనటానికి బదులు అపస్మారకం అంటారు. అది తప్పు. అనవసర ఖర్చును దుబారా ఖర్చు అంటాము కదా. ఈ దుబారా అనే పదం బహుశా ఉర్దూ/ఫారసీ నుండి వచ్చిన అన్యదేశ్యం. ఆ భాషల్లో దుబారా అంటే రెండవ సారి. అయితే దూబఱ అన్నది కూడా సరైన పదమే. ఫలానా కళ్యాణ మంటపము అని బోర్డు మీద రాసి ఉన్నదనుకోండి. అప్పుడు మండపముకు బదులు మంటపము అని తప్పుగా రాసారనుకోవాలి. ప్రమాణిక నిఘంటువుల్లో మండపము అనే పదమే ఉంది. కాని కొన్ని ఇతర నిఘంటువుల్లో మంటపము కూడా ఉంది. ‘కళ్యాణ మంటపములో’ కళ్యాణ కూడా తప్పే. అదేవిధంగా అపేక్ష , ఆపేక్ష అన్న పదాలు. ప్రమాణిక నిఘంటువుల్లో ‘అపేక్ష’ మాత్రమే ఉంది. పశువులను మేపేవాడిని పశువుల కాపరి అంటాం కదా. ‘పసుల కాపరి’ అన్నా కరెక్టే. ఎందుకంటే పశువులుకు సమానమైన పదం పసులు.

‘స’ కు బదులు ‘శ’ రాయటం కూడా మనం గమనించవచ్చు. రాశాను, చేశాను, చూశాను, వేశాను – ఇలాంటి పదాల్లో ‘శా’ అక్షరం ఒప్పుగా చలామణి అవుతున్నప్పటికీ, రాసాను, చేసాను, చూసాను, మొదలైనవే కరెక్టు. ఎందుకంటే ఈ పదాల అసమాపక క్రియలను రాసినప్పుడు రాసి, చూసి, చేసి, అనే అంటాం కాని రాశి, చేశి…. అనం. ఒకవేళ అన్నా అవి తప్పులే. “నరశింహం కుర్చీలో ఆశీనుడై ఉన్నాడు”- ఇట్లాంటి వాక్యాలతో కథను మొదలుపెట్టే కథా రచయితలూ ఉంటారు. కాని ప్రారంభ వాక్యంలోనే రెండు తప్పులున్నాయని ఎడిటర్ గారు ఆ కథాప్రతిని చించి, చి.కా.బు.కు దాఖలు చేస్తారు (చికాబు అంటే చిత్తు కాగితాల బుట్ట అని తెలియని పాఠకులు ఉండరు బహుశా). అలాగే వీశెడు అనే పదాన్ని ఒక కొలమాన ప్రమాణానికి సమానార్థకంగా వాడుతారు. కాని వీసెడు అన్నదే సవ్యమైన పదం. వీసె, వీసియ, వీసము ఇవన్నీ సరైన పదాలే. వీశె, వీశ అన్నవి తప్పులు. “మరేనండీ, మీకు శాలరీ వచ్చింది కదా. నాకోసం ఓ శారీ కొనరూ?” అని తన భర్తను అడుగుతుంది ఓ ఇల్లాలు. మరొకావిడ “ఏమండీ బియ్యం నిండుకున్నాయి. ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొట్టులోంచి కొన్ని శాంపిళ్ల బియ్యం తీసుకు రండి. వండుకుని చూద్దాం” అంటుంది. Salary, Sari, Sample లను సాలరీ, సారీ, సాంపిల్ అని ఉచ్చరించాలి.

“రాత్రి సినిమాకు వెళ్లావట కదా. ఎలా ఉందేమిటి సినిమా?” అని ఒక మిత్రుడు అడిగితే “వరష్టుగా ఉంది” అని జవాబివ్వటం మనం గమనించవచ్చు. అలాగే “పోలీసులు ఆ దొంగల్ని అరెష్టు చేసారు” అని ఉచ్చరిస్తారు కొంత మంది. ఇవి ఉచ్చారణలోని దోషాలు అనేదాంట్లో సందేహం ఉండకూడదు. వర్స్ట్ , అరెస్ట్ అని ఉచ్చరించటం సరైనది. ఇవి ఆంగ్ల పదాలైనా వీటిని మనం తరచుగా వాడుతాము కనుక ఈ పదాల సరైన ఉచ్చారణ కూడా తెలిసి ఉండాలి మనకు.

నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు నా స్నేహితుడొకడు, శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో జమున (సత్యభామ) టెంపర్ అనే ఆంగ్ల పదాన్ని మాట్లాడిందని చెప్పటంతో ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. చాలా సంవత్సరాల తర్వాత ఆ సినిమాను చూసిన నేను, నా స్నేహితుడు పొరపాటు పడ్డాడని గ్రహించాను. ఆ సినిమాలో సత్యభామ (జమున) “ఎంత తెంపరితనమే నీకు?” అనే డైలాగును అంటుంది. మనవాడు తెంపరిని టెంపర్ గా తప్పుగా అర్థం చేసుకున్నాడు. తెంపరి అంటే సాహసికురాలు. తెంపు + అరి = తెంపరి. తెంపరితనము అంటే సాహసము. ఇదేవిధంగా స్వల్ప భేదంతో దాదాపు ఒకేలా ఉండే పదాలు కొన్ని ఉంటాయి. నీటు అన్నది నీట్ (Neat) అనే ఆంగ్ల పదాన్ని తలపిస్తుంది. కాని అది తెలుగు పదమే. నీటు = అందము, మురిపము. నీటుగాడు = శృంగారాన్ని ఒలకబోసే అందగాడు. తందర అనే మరొక తెలుగు పదం ఉంది. ఇది ‘తొందర’ లాగ వినిపించే పదం. తందర = కునికిపాటు. తంద్ర అని కూడా అనవచ్చు.

గుంఫనము, గుంభనము వేర్వేరు పదాలు. “ఆయన గారి కవిత్వంలో పదగుంఫనం అతిగా ఉంటుంది” అన్నప్పుడు గుంఫనము = మాటలను కూర్చుట లేక గుప్పించుట. “వాళ్ల ఇంట్లోని గొడవల గురించి కూపీ లాగాలని ఎంతో ప్రయత్నించాను. కాని వాళ్లందరూఎంతో గుంభనంగా ఉన్నారు” అన్నప్పుడు గుంభనము = తేటతెల్లముగా లేకపోవుట. ప్రణతి, ప్రణుతి కూడా వేర్వేరు పదాలు. ప్రణతి = నమస్కారము. ప్రణుతి = వాసి, ప్రసిద్ధి. బావి, భావి అనేవి వేరువేరు పదాలు అని తెలిసినా రాసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే పొరపాటు చేసినవాళ్లం అవుతాము. బావి = కూపము (Well). భావి = భవిష్యత్తు. షష్టి , షష్ఠి గురించి ముందే చెప్పుకున్నాం. షష్టి = అరవై. షష్ఠి = ఆరవ. “తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పుళిహోర, దద్దోజనం రెండూ తీసుకున్నాము” అని ఎవరైనా చెబితే, రెండు పదాలనూ తప్పుగా వాడినారని వెంటనే గమనించాలి. పులిహోర లేక పులియోర అనేవి సరైన పదాలు. పుళిహోర తప్పు. కొందరు పులిహార అంటారు. అది కూడా తప్పే. ఇక దధి + ఉదనము = దధ్యోదనము అవుతుంది. దద్ధోజనము తప్పు.

ఒకసారి టీ.వీ.లో ఒక విలేకరి దృష్ట్యంతము అనే పదాన్ని పదేపదే ప్రయోగించాడు. ఆ పదాన్ని ఎన్నిసార్లు మళ్లీమళ్లీ వాడాడంటే సాధారణంగా అందరూ దృష్టాంతము అంటారు కాని, అది తప్పు, దృష్ట్యంతము సరైన పదం – అని శ్రోతలకు/వీక్షకులకు అన్యాపదేశంగా తెలియజెప్పాలని అతనికి కోరికగా ఉన్నట్టు అనిపించింది. కాని అది దృష్టి + అంతము కాదు. యాదృచ్ఛికంగా ఆ పదంలో దృష్టి అన్న పదాన్ని విడదీసే అవకాశముందని అనిపించినంత మాత్రాన, అట్లా విడదీయటం తప్పు. కాబట్టి దృష్టాంతము అనేదే రైటు. ఇంగ్లిష్ లో Prepone అనే పదాన్ని కూడా ఇలానే తప్పుగా వాడుతారు చాలా మంది. ఆంగ్ల భాషలో Prepone అన్న పదమే లేదు! ‘Postpone’ ఉన్నది. కాని అది ఏకపదం (Single word). యాదృచ్ఛికంగా అందులో Post అన్న పదం ఉన్నందుకు Post mortem, Post modern, Post natal, Post independence లలా దాన్ని భావించకూడదు. మరి Postpone కు విరుద్ధమైన ఆంగ్ల పదమేది? అంటే దానికి సమాధానం Advance. పరీక్షలు కొన్ని రోజులు ముందుకు జరిగాయి అనదల్చుకుంటే అప్పుడు The exams are/were advanced అనాల్సి ఉంటుంది. అదేవిధంగా Urbane కూ Urban కూ మధ్య ఎటువంటి సంబంధం లేదు. అర్బన్ అంటే పట్టణ (సంబంధమైన). అర్బేన్ అంటే ‘మాటతీరులో, వ్యవహారంలో మర్యాదగా ఉండే’ అని అర్థం. ఇవి రెండూ విశేషణాలు (Adjectives). పల్లెటూళ్లలో ఉండే మనుషుల్లో కూడా urbanity కనిపించవచ్చు.

గోమేధికము అనేది నవరత్నాలలో ఒకటి. అయితే కొంత మంది గోమేధుకము అని తప్పుగా రాస్తారు. “ఫలానా విషయం గురించి ప్రజా సంఘాలవాళ్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు” అని వార్తాపత్రికల్లో ప్రచురితమవ్వటం సాధారణంగా జరిగేదే. కాని ఒత్తిడి అనే పదం తెలుగు భాషలో లేదు. ‘ఒత్తడి’ మాత్రమే ఉంది. ఒత్తడి లేక ఒరపిడి లేక ఒరిపిడి – ఈ పదాలు రాపిడి అనే అర్థాన్నిస్తాయి. వత్తిడి కూడా తప్పే. అయితే ఒత్తిడి అన్న పదం మన భాషలో బాగా పాతుకునిపోయి స్థిరపడింది కనుక, ఇప్పుడు భాషాసవ్యత కోసం ఒత్తిడికి బదులుగా ఒత్తడి అన్న పదాన్ని వాడలేము. ఛందోబద్ధమైన పద్యాలను రాస్తున్నప్పుడు గాని, గ్రాంథిక భాషను రాస్తున్నప్పుడు గాని ఒత్తడి అని ఉపయోగించ వచ్చు. కొన్ని పదాల్లో ఒక అక్షరానికి దీర్ఘాన్ని చేర్చటం ఒక్కోసారి సరైనదైతే ఒక్కొసారి తప్పు అవుతుంది. అధిపతి కరెక్టే కాని, అధిపత్యము తప్పు. ‘ఆధిపత్యము’ రైటు. అదేవిధంగా అభిజాతుడు రైటే కాని, అభిజాత్యము తప్పు. ఆభిజాత్యము అనాలి. అలంకారం, ఆలంకారికం సరైనవి. అలంకారికం తప్పు. కాని ‘ఘి’ కి దీర్ఘాన్ని చేర్చుతూ సాంఘీకము అన్నామనుకోండి. అది తప్పు అవుతుంది. సాంఘికము అనేదే రైటు.

అధిదేవత, అధిదేవుడు, అధిదైవము అంటే పరమాత్మ. కాని ‘రసాధిదేవత’కు బదులు రసాదిదేవత అని రాస్తారు కొంత మంది. ఆది అంటే మొదటి, లేక ఇతర కనుక, రసాదిదేవతలు అన్నప్పుడు తప్పు అర్థం ఉత్పన్నం అవుతుంది. “దేవుని పూజ కోసం సమస్త సామాగ్రి తెచ్చాను” అన్నాడనుకోండి ఓ పురోహితుడు. అప్పుడు ఆయన పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే సామాగ్రి తప్పు. సామగ్రి అన్న పదమే సరైనది. నాగరికులు, నాగరికత అనటానికి బదులు కొందరు నాగరకులు, నాగరకత అనే పదాలను వాడుతారు. ప్రమాణిక నిఘంటువుల ప్రకారం నాగరికులు, నాగరికత అనేవే సరైన పదాలు.

ఊయల అనే పదానికి దగ్గరగా ఉండే పదాలు ఎన్నో ఉన్నాయి. ఉదా: ఊయెల, ఊయాల, ఊయేల – ఇవన్నీ సరైన పదాలే. ఉయ్యాల, వుయ్యాల అన్న పదాలు నిఘంటువుల్లో లేవు. “మంత్రిగారు ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసారు” అని వార్తాపత్రికల్లో చదువుతాం. ఇక్కడ పంపిణి అనేదే రైటు. పంపిణీ తప్పు. ఇదేవిధంగా శాలువను శాలువా అని, నీటి తీరువను నీటి తీరువా, అని గర్భిణిని గర్భిణీ అంటూ రాయడం భాషాపరంగా ఒప్పుగా ఆమోదించబడదు. కేరళ రాష్ట్రంలో మాట్లాడే భాషను మళయాళము అనాలని ప్రమాణిక నిఘంటువు చెబుతోంది. కాని అర్థాన్ని వివరిస్తూ ‘మలయ’ పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతము అని చెప్పబడింది. ఉదాహరణను ఇవ్వటాన్ని ఉదహరించుట అని కొందరు తప్పుగా రాస్తారు. ఉదాహరించుట అనేదే సరైన పదం.