అగ్నిపర్వతం అంటే, గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో (పై పొర -క్రస్టు) ఏర్పడే చీలిక. ఉపరితలం క్రింద, శిలాద్రవం ఉండే గది నుండి ఈ చీలిక ద్వారా వేడి లావా, అగ్నిపర్వత బూడిద, వాయువులూ వత్తిడితో బయటికి చిమ్ముతాయి. భూమిపై అగ్నిపర్వతాలు ఎందుకు ఉంటాయంటే దాని పెంకు 17 ప్రధాన, దృఢమైన టెక్టోనిక్ పలకలుగా విభజించబడి ఉంది. ఈ పలకలు దాని మాంటిల్‌లోని వేడి, మృదువైన పొరపై తేలుతూంటాయి. అందువల్ల, టెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ ఒకదాన్నుండొకటి దూరంగా జరుగుతూ, ఒకదానికొకటి దగ్గరౌతూ ఉన్నచోట్ల అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. చాలావరకు ఇవి సముద్రాల లోపల ఉంటాయి. ఉదాహరణకు, మిడ్-అట్లాంటిక్ రిడ్జ్ (అట్లాంటిక్ సముద్రం లోపల ఉన్న శిఖరాలు) వద్ద విడిపోతున్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల సంభవించే అగ్నిపర్వతాలున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో దగ్గరౌతున్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలు ఉన్నాయి. పెంకు లోని పలకలు సాగుతూ, సన్నబడుతూ ఉన్న చోట్ల కూడా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఉదా., తూర్పు ఆఫ్రికా రిఫ్ట్, వెల్స్ గ్రే-క్లియర్‌వాటర్ అగ్నిపర్వత క్షేత్రం, ఉత్తర అమెరికా లోని రియో గ్రాండే రిఫ్ట్. ఈ రకమైన అగ్నిపర్వతం "ప్లేట్ హైపోథీసిస్" అగ్నిపర్వతం అనే నిర్వచనం కిందకు వస్తుంది. పలకల సరిహద్దులకు దూరంగా ఉన్న అగ్నిపర్వతాలను మాంటిల్ ప్లూమ్స్ అని అంటారు. "హాట్‌స్పాట్" అనే ఇలాంటి అగ్నిపర్వతాలకు ఉదాహరణలు హవాయిలో ఉన్నాయి. భూమిలో 3,000 కి.మీ. లోతున ఉన్న కోర్-మాంటిల్ సరిహద్దు నుండి పైకి ఉబికి వచ్చే శిలాద్రవంతో ఇవి ఏర్పడతాయి.
(ఇంకా…)
|