ఈమాట డిసెంబర్ 2021 ముందుమాట పుస్తకావిష్కరణల పోలిక అన్న ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఈనాటి తెలుగు పుస్తకావిష్కరణల పద్ధతి ఒక ప్రహసనమే కావచ్చు. దానికి మార్పు కూడా అవసరమే కావచ్చు కానీ ‘పాశ్చాత్య పద్ధతి నవలంబించండి’ అన్న సూచన మాత్రం ఈనాటి తెలుగు రచయితల, ప్రచురణకర్తల, పుస్తకశాలల పరిస్థితిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని అనిపించడానికి కారణాలు చాలా వున్నాయి.
ఫిబ్రవరి 2022
ఒక భాషకు చెందిన సాహిత్యం, ప్రత్యేకించి ఒక కాలానికి చెందిన సాహిత్యం కొన్ని సారూప్యాలను కలిగి ఉండటం గమనిస్తాం. అది కొన్ని విభజనలకు లోబడే రీతిలో కొన్ని ధోరణులను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ ధోరణులను దాటి రాసే అరుదైన సాహిత్యకారులు ఉంటే ఉండవచ్చు గాక. కాని, సమకాలీన సామాజిక ధోరణులు, సమకాలీన ప్రసిద్ధ సాహిత్యకారుల దృక్పథాలు, చాపకిందనీరులా ఒక భాష సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయనడం అతిశయోక్తి కాదు. నిలవనీరులా సాహిత్యమిలా పాతబడే సందర్భాల్లో అనువాదసాహిత్యపు అవసరం స్పష్టమవుతుంది. ఒకే కాలానికి చెందిన, ఒకే నేలకు చెందిన మనుషులు, మరొక భాషలో, మరొక ప్రాంతంలో చేస్తున్న ప్రయోగాలను, వేస్తున్న ముందడుగులను చూపెడుతుంది. పరభాషల రచయితలు తమ తమ జీవనవాస్తవికతను సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారో గమనించే వీలిస్తుంది. వేరే వేరే సంస్కృతులు, వాతావరణాలలోని మనుషుల మధ్యనున్న భిన్నత్వాన్నీ ఏకత్వాన్నీ కూడా మిగతావారికి పరిచయం చేస్తుంది. అందువల్ల ఒక భాషలోని సహజ సాహిత్యం ఎంత ముఖ్యమో అనువాదసాహిత్యం కూడా అంతే ముఖ్యం. ఇలా ప్రపంచభాషలనుంచి ప్రోదిపడ్డ అనువాదాల వల్ల ఆంగ్లసాహిత్యం ఎంత పరిపుష్టమయిందో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే, ఇది కేవలం రాశికే సంబంధించిన విషయం కాదు కనుక, అనువాదకులు కూడా తమ పని పట్ల ఆ గౌరవాన్ని, జాగ్రత్తని కలిగి ఉండాలి. కేవలం రెండు భాషలూ అర్థమవుతాయన్న మాట దగ్గర ఆగిపోకుండా, రెండు భాషలలోని నుడికారాన్ని ఆకళింపు చేసుకోవాలి. రెండు భాషలలోని వ్యావహారిక పదాలను, జాతీయాలను, వాడుకలో పదాలకున్న భిన్నార్థాలను తెలుసుకోవాలి. ఆపైన మూలభాషలోని సహజత్వాన్ని అనువాదభాషలోకి అంతే సహజంగా తేవాలి. మూలంలోని వాక్యాన్ని అనువాదభాషలోకి అలాగే తేవడం కృతకమైన పని. ఎందుకంటే మూలం ఏదైనా, అనువదించబడ్డాక అది ఆ భాషాసాహిత్యం అవుతుంది. అందువల్ల ఆ అనువాదం తెలుగులోకి అయితే అది తెలుగు భాష, వ్యాకరణం, నుడికారాలతో అలరారవలసిందే. కొన్ని రచనలు కేవలం తెలుగులో చెప్పబడతాయి. మరికొన్ని కథావస్తువులు తెలుగు నేల, సంస్కృతిలో ప్రతిక్షేపించబడతాయి. మూలానికి విధేయత అంటే, ఏ పదానికాపదం తెలుగులో చెప్పడం కాదు, మూలరచన ఉద్దేశ్యాన్ని మార్చకపోవడం, అదేసమయంలో మూలరచన ధ్వనినీ అనువాదభాషలోకి తేగలగడం. ఆ దృష్టితో చూసినప్పుడు, సృజనాత్మకత పరంగా, అనువాదసాహిత్యం సహజసాహిత్యానికేమాత్రమూ తక్కువ కాదు. ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు ఇతర భాషల ఉచ్చారణ, వాడుక, భిన్నార్థాలవంటివి అందరికీ అందుబాటుకొచ్చాయి. ఆ రకంగా, అనువాదకుల విషయవస్తు సేకరణ సాంకేతికత వల్ల కొంత సులభమైన మాట నిజమే అయినా, మూలభాషలోని సాహిత్యరీతికి సరిపోయిన వ్యక్తీకరణను అనువాదభాషలోకి తేవడమన్న కష్టం నిత్యనూతనమైనదే. పైపెచ్చు, సృష్టిలో సృజనకారులకు ఉన్న వెసులుబాటు ప్రతిసృష్టిలో ఉండదు. అందువల్ల, సృష్టి ప్రతిసృష్టి రెండూ శ్రమపూరితాలే అయినా అనువాదకుల పని మరింత కష్టమైనది, వారి బాధ్యత మరింత గురుతరమైనది. ఇది కేవలం అనువాదకులే కాదు, పాఠకులు, ప్రచురణకర్తలూ గమనించాలి. మూలరచయితతో పాటు అనువాదకుల పేర్లనూ పుస్తకాలపై ప్రముఖంగా ప్రచురిస్తూ, ఈ ప్రక్రియకూ సముచిత గౌరవాన్నివ్వడం, సాహిత్య సమాజపు కనీస కర్తవ్యం.
‘మరేమో ఒచ్చి’ ఏం గోడు చెప్పుకోడానికి ఒచ్చిందో వినాలని ఉన్నా ఆవిడ వెళ్ళిపోయాక బామ్మా అమ్మా మళ్ళీ మళ్ళీ ఎలాగా వాళ్ళలోవాళ్ళు ఏకరువు పెట్టుకుంటూనే ఉంటారు! భోగట్టా తెలీకపోదు! ఎటొచ్చీ ఆవిడ నోట విండం ఇహ కుదరదు! నేనక్కడ ఉంటే నవ్వుతానని, నవ్వు ఆపుకోనని అమ్మకు భయం! ఆవిడ ఎదురుగా నన్ను చీవాట్లు పెట్టడమూ కుదరదు! అదీ సంగతి!
మీ ఆంగ్ల అనువాదాలు మీ బ్లాగులో, ఎఫ్.బీ.లో, చూస్తూనే ఉంటాను. అవి అస్సలు అనువాదాలనిపించవు. ఇంగ్లీషులోనే రాసేరేమో అనిపిస్తాయి. మీ అనువాదాలు చదివినప్పుడల్లా నా రచన ఒక్కటైనా మీరు అనువాదం చేస్తే బాగుండునని తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఈ జన్మకి ఆ కోరిక తీరేనా!? అన్నట్టు, నా పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. తప్పకుండా చదువుతారు కదూ?
ఆ రోజు నుండి నేను హిందూ పత్రికలో అప్పుడప్పుడు కనిపించే ఆవుగారి కార్టూన్ కోసం వెతికేవాడిని. ప్రచురితమైన ఆయన ప్రతీ బొమ్మని గంటల తరబడి నేను చాలా శ్రద్దతో అధ్యయన పూర్వకంగా పరిశీలించేవాడిని. ఆయన కార్టూన్లలోని రాజకీయ వ్యాఖ్యానాలలోని చురుకు, వెటకారం నాకు అర్థం అయ్యేంత వయసు కాదు కానీ చిత్రించే బొమ్మపై ఆవుగారికి ఉన్న నియంత్రణ నన్ను ముగ్ధుణ్ణి చేసేది.
నాకు ఆశ్చర్యమనిపించింది. ఈ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉన్నమాట నిజమే గానీ దీని దిగువున అరవైవేలమంది బానిస ఖైదీలు ఉండటం సాధ్యమనిపించడం లేదు అన్నాను. ఒక గట్టి నిట్టూర్పు విడిచి- వాళ్లంతా గొలుసులతో గోడలకి కట్టివేయబడ్డారు. నిలబడటానికి కూడా చోటు లేనంతగా కిక్కిరిసి ఉండేదీ జైలు. వాళ్లల్లో చాలామందికి నిలబడే నిద్రపోవలసివచ్చేది అని వివరించాడు హఫీద్.
బుజ్జాయిగారు అలా కాదు అమిత సింప్లీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయిగారి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కానరారు. అందువల్లనే ఒకానొక సమయంలో దేశంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో బుజ్జాయిగారి బొమ్మలు మాత్రమే ప్రచురితం అయ్యాయి. మరే తెలుగు చిత్రకారులు ఎంత ప్రయత్నించినా అందులో చోటు చేసుకోలేకపోయారు.
ఆచార్య మహాకాశ్యపులవారికి వీడ్కోలు చెప్పడానికి విశాఖారామ పరిసరాల్లోని అనేక విహారాలనుంచి విచ్చేసిన బిక్కులతో సముద్రగర్భంలోకి చొచ్చుకొని ఉన్న ఆ చిన్నపర్వతమంతా నిండిపోయింది. తెరచాపలతో సముద్రంపై ఊయల ఊగుతున్న నావ వైపుకి పయనిస్తూ ఉన్న చిన్న పడవ నిదానంగా వారికి దూరమయింది. అప్పటివరకు వారికి తోడునీడగా అండగా రక్షణగా నిలబడ్డ మహాక్షుద్రకుడు అక్కడే ఆగిపోయాడు.
ఉయ్యాల బల్లమీద కూర్చుని తనివి తీరేదాకా ఊగింది. తర్వాత దగ్గర్లో ఉన్న అంగటికెళ్ళి ఒకే ఒక్క చాప మాత్రం కొనుక్కొచ్చుకుంది. హాల్లో చాప పరిచి పడుకుంది. ఇది తన ఇల్లు. తను మాత్రమే ఉండబోయే ఇల్లు. ఇలాంటొక ఇల్లు ఉండటం ఎవరికీ తెలియకూడదు. ఈ ఇంటిలో తనతో ఎవరూ ఉండరు. తాను మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాను అన్నది ఆమెకు వల్లమాలినంత సంతోషాన్ని ఇచ్చింది.
మామూలుతనపు రోడ్డులెంబడి
నొప్పి సూది గుచ్చుతూ
అంబులెన్సు
కుట్లేసి పోయినట్టు
సాల్ గిరా తేదీల్లోనో మరి
ఎక్కడ నక్కిందో
ఎనెన్ని భూముల కింద పారుతుందో
కుస్తీలో జగా ప్రావీణ్యం విని, అతడికి మరి కొన్ని ఉద్యోగావకాశాలు వచ్చి పడ్డాయి. తుపాకీ పట్టుకుని ఒక ఇంటి ముందు గార్డుగా కూచోడం, దానికి మంచి జీతం. ఇంకో ఉద్యోగం మరీ గొప్పది. కావలసినంత తిండి, జీతం, అందరూ తనని చూసి భయపడే ఉద్యోగం. యజమాని చెప్పినపుడు, ఎవరిదన్నా కాలు విరగ్గొట్టడం, మొహం పగలగొట్టడం, మెడ విరిచేయడం… ఇదీ అతని పని అక్కడ.
తను రాస్తాడు. ఇవ్వాళే మొదలుపెడతాడు. చివరికొచ్చేసరికి స్ట్రాంగ్‌గా మారుతోంది ఆఫ్టర్ లంచ్ సిగరెట్. అరుంధతీ రాయ్ అన్నట్లు. మానెయ్యాలి. అరుంధతీ రాయ్‌నా? జోకులా? సిగరెట్లు. కాలిస్తే బాగుంటుంది. కాల్చకపోతే, తపనని తట్టుకోవడం కష్టం. అసలైనా ఇష్టమైంది, ఈరోజు చేస్తున్నది ఎప్పుడూ ఎందుకని నచ్చదు? ఒకప్పటి జులపాల, బెల్‌బాటమ్‌ల రోజులే బాగున్నాయనిపిస్తాయేం? అవన్నీ తర్వాత. ముందు రాయాలి. ఇవాళ్టినుంచీ. రాస్తాడు. రాయగలడు తను.
లైబ్రరీ మెట్లమీద
మనం
చేజార్చుకున్న ఊహలన్నీ
ఏ నిద్ర పట్టని రాత్రో
నా వెంటబడి తరుముతాయి
తీరంలో మనం
అల్లుకున్న కవితలన్నీ
కెరటాల్లా హోరెత్తుతాయి
లైబ్రరీ దగ్గర రావుగారు చూస్తూ ఉంటాడేమో పర్వాలేదు సాయంత్రం కలవచ్చు అర్జంట్ విషయాలు ఏమున్నాయి. రోజూ ఉండే విషయాలే. ఆయన నిన్న వచ్చిన ఫోన్ గురించి చెప్తాడు ‘అబ్బాయి రమ్మంటున్నాడు ఎలా వెళ్ళడం. ఇక్కడ పంటలు వచ్చాక రైతు దగ్గర కౌలు వసూలు చేసుకుని వెళ్లాలి’ అంటాడు రైతు బ్యాంకులో వేస్తాడు డబ్బులు అంటే వినడు. ఎప్పుడూ ఉండేదే ఆయన చెప్పడం నేను వినడం నేను చెప్పడం ఆయన వినడం.
కావున నా సూచన ఏమనగా ఋ-కారమునకు యతి బహుళము చేయవలయునని. అనగా రి-కారము, రు-కారము రెండింటితో చెల్లించుటకు శాస్త్రబద్ధముగా అనుమతి నొసగవలెనని. ఈ శాస్త్రసమ్మతి విశ్వవిద్యాలయముల ద్వారా, భాషాశాస్త్రజ్ఞులద్వారా, పండితులద్వారా, ప్రభుత్వము ద్వారా జరుగవలయును. అంతేకాక విలోమ ఉపయోగమును కూడ బహిష్కరించవలెను.
రవివర్మ అనే ఆనాటి కళాకారుని జీవితకథలో ఒకటి రెండు మలుపులను వెదికి పెన్సిల్ చెక్కినట్టు రాసిపడెయ్యటం, కిట్టించడం కుదరదు–నాటి ప్రాంతీయ చరిత్ర, వలస కళల వాతావరణం, తైనాతీల వస్తుప్రపంచం, బ్రిటిష్ జమీందారీ అడుగుబొడుగు నీడలు సర్వసమగ్రంగా శోధించి నేతపని చేయడంవల్ల పాఠకుడికి ‘రవి’ కళాప్రపంచపు ‘అదనపు విలువలు’ బహుళ ప్రయోజనం చేకూర్చాయి.
పెళ్ళాడటానికి ప్రేమ ఒక్కటే అర్హతగా నిలిస్తే బాగుంటుంది కాని, మానవ సహజమైన కుతూహలం అవతలి వ్యక్తిలోని ప్రత్యేకతలు తెలుసుకోనిదే, ఎందెందులో అతడు/ఆమె తనకు సరిజోడో తెలుసుకోనిదే అంత త్వరగా శాంతించదు. తృప్తి చెందదు. ఈ కథానాయకుడు అలాంటి కుతూహలపరుడు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.